ఎన్నికలు అన్ని రాజకీయ పక్షాలకూ అగ్నిపరీక్ష. పార్టీ యంత్రాంగం ‘లేని’ జనసేన ఎన్నికల్ని ఎలా ఎదిరిస్తుంద నేది పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సేన కార్యకర్తల్ని పీడిస్తున్న సవాలు. ఎన్నికల్లో నామ పత్రాల దాఖలుకు కేవలం రెండు వారాల వ్యవధి మాత్రమే ఉంది, 175 విధానసభ ,27 లోక్‌సభ స్థానాలకు గెలుపు గుర్రాల్ని ఎలా ఎంపిక చేస్తారనేది చర్చనీయాంశం. ఇతర పక్షాలతో పోలిస్తే జనసేన కార్యకర్తలు, అభిమానుల దండు, పార్టీ నిర్వహణా యంత్రాంగం చాలా చిన్నదిగా రాజకీయ పరిశీలకుల అంచనా. పాలక పక్ష తెదేపా సంస్థా గతంగా బలంగా ఉంది. వైసీపీకి యంత్రాంగంఉంది, రాజకీయ అనుభవం తక్కువేమీ కాదు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొత్తదేమీ కాదు. ఇక తొలిసారి ఎన్నికల బరిలోకి దిగనున్న జనసేనకు ఇవన్నీ సవాళ్లే, సమస్యలు. ఏతవత అభ్యర్థుల ఎంపిక, యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఎన్నిక పోరుకు సమయత్తం చేయటం, చివరకు గెలుపు అన్నీ సవాళ్ల మీద సవాళ్లే. ఎక్కడా అంది వచ్చే అంశం, అనుకూల వాతావరణం కనిపించటం లేదు. అభ్యర్థుల ఎంపికపైనే పార్టీల జయాప జయాలు చాలా వరకూ అధార పడి ఉంటాయి. ప్రాంతీయ, సామాజిక వర్గాలు, ఆర్థిక సంపన్నత, జనాదరణ, ప్రత్యర్థుల్ని ఎదిరించే సమర్థత, వీటికి తోడుగా ఎత్తుకు పై ఎత్తుల్ని వేసే చాణక్యాన్ని కలిగిన అభ్యర్థుల ఎంపిక ఎంతో కఠిన తరమైనది. ఇదంతా పవన్ కళ్యాణ్‌కు కొత్తదనే విషయం అందరికీ తెలుసు. ప్రజా రాజ్యం పార్టీలో క్రియా శీలంగా పవన్ పరిశ్రమించినప్పటికి అభ్యర్థుల ఎంపికను ఇతరుల నిర్వర్తించటం గమనార్హం. వామ పక్షాలతో సీట్ల సర్దుబాట్లు, ప్రచారం ,ఎన్నికలవ్యూహం, ప్రణాళికల ఖరారు ఇలాఅన్నీ సమస్యలే. ఈ బాధ్యతలనన్నింటినీ పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్వర్తిస్తున్నారు. ఎక్కడా పొరబాటు జరిగిన ఎన్నికల్లో జనసేన ఆటలో అరటి పండుగా మిగలటం ఖాయం.