న్యూఢిల్లీ: లోక్సభలో జరిగిన పొగబాంబు దాడి అంశంపై సోమవారం పార్లమెంట్ లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. భద్రతా వైఫల్యాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉదయం రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడింది. తొలుత 11.30 వరకు చైర్మెన్ జగదీప్ వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఇక లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. విపక్ష నేతలు 267 నియమం కింద 22 నోటీసులు ఇచ్చారు. వాటిని తిరస్కరించినట్లు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్ తెలిపారు. సెక్యూర్టీ వైఫల్యం అంశంపై లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై రాజకీయం చేయడం శోచనీయమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. వెల్లోకి దూసుకువచ్చి.. నినాదాలు చేయడం సభా మర్యాదలకు విరుద్ధమని తెలిపారు. కీలకమైన అంశాలపై చర్చ చేపట్టేందుకు ప్రతిపక్షాల సహకారం అవసరమని ఓం బిర్లా అన్నారు. పొగబాంబు దాడి పై విచారణ జరుగుతోందని, దర్యాప్తు ఏజెన్సీలు ఆ వ్యవహారాన్ని తేలుస్తాయన్నారు. భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని లోక్సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉభయసభల నుంచి సస్పెండ్ అయిన 13 మంది ఎంపీలు పార్లమెంట్ ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. నినదాలు రాసిన అట్టల్ని ప్రదర్శించి నినాదాలు చేశారు. వారితో సోనియా గాంధీ మాట్లాడారు.