ముంబై: కొనుగోలుదారు పార్కింగ్ స్థలం చూపించకుంటే తమ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయబోమని రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. తాము కొన్న వాహనానికి పౌర సంస్థ కేటాయించిన పార్కింగ్ స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను చూపిస్తేనే రిజిస్ట్రేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. ముంబై మెట్రోపాలిటన్ రీజన్‌లో పార్కింగ్ కొరత తీవ్రంగా ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు పార్కింగ్ ప్లాజాల నిర్మాణాన్ని అనుమతించడానికి పట్టణాభివృద్ధి శాఖ కృషి చేస్తోందని మంత్రి వెల్లడించారు. ‘నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల తమ కార్లను రోడ్లపై పార్క్ చేస్తున్నారు. దీనివల్ల జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సివస్తోంది. అంతేకాకుండా అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అందించే అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతుంది. వీటిని నివారించడానికి కార్లు కొనుగోలు చేసే వారు పార్కింగ్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించాలని నిబంధన పెట్టాం’ అని ఈ ఏడాది ఆరంభంలో ప్రతాప్ సర్నాయక్ ప్రకటించిన విషయం తెలిసిందే.