బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవంలోజరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహించి తనను పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లపై హోం మంత్రి జి. పరమేశ్వర తీవ్రంగా స్పందించారు. ‘పిరికిపందలా పారిపోను అంటూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది’ లేదని తేల్చి చెప్పారు. బీజేపీ, జేడీ(ఎస్) పార్టీలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి, మరికొందరిని బదిలీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని, అసలు బాధ్యులైన మంత్రులను కాపాడుతోందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రమంత్రి కుమారస్వామి మరో అడుగు ముందుకేసి, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య, శివకుమార్లను పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. పెద్ద సంఖ్యలో జనం గుమికూడటానికి అనుమతించడం, ఆ తర్వాత తలెత్తిన గందరగోళానికి వారిద్దరే కారణమని ఆయన ఆరోపించారు.