హైదరాబాదు: ఆస్కార్ పురస్కారాన్ని పొందిన కొరియా చిత్రం ‘పారసైట్’ను చూస్తూ నిద్ర పోయాను. ఆ సినిమా తనను పెద్దగా ఆకట్టుకోలేదు. బోర్ ఫీలయ్యాన’ని దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేక స్పందనలు వచ్చాయి. మిఠాయి చిత్రం దర్శకుడు ప్రశాంత్ కుమార్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. ‘ప్రియమైన రాజమౌళికి. రసైట్ ఒరిజినాలిటీ ఉన్న చిత్రం. ఒరిజినాలిటీకి ఎప్పుడైనా గౌరవం ఇవ్వాల్సిందే. భాషా సరిహద్దులను దాటుకుని మరీ వచ్చిన పారాసైట్ వంటి శక్తిమంతమైన చిత్రాలకు తప్పకుండా గౌరవం ఇవ్వాలి. తోటి దర్శకుడిగా మీ వ్యాఖ్యలు సరిగా లేవని, అభిరుచి రహితంగా ఉన్నాయని గుర్తించాను. ముఖ్యంగా మీ అభిప్రాయాలు తర్కానికి దూరంగా ఉన్నాయి. ‘పారసైట్’ చిత్రం ఓ చరిత్ర సృష్టించింది. ఓ విదేశీ చిత్రం ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం మామూలు విషయం కాదు. సోర్సెర్సీ, టరాంటినో వంటి మహామహులు కూడా ప్రశంసించిన గొప్ప చిత్రం అది. నాకు తెలిసినంత వరకు వాళ్లు బాహుబలి గురించి ఏమీ చెప్పలేదు. ఒరిజినాలిటీ గురించి మాట్లాడాలంటే, మీ సినిమాల్లో అందుకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు ‘సై’ సినిమా గురించి చెప్పాలంటే, అందులో మీరు ఎన్నో సీన్లను ఇతర సినిమాల నుంచి ఉన్నది ఉన్నట్టు ఎత్తేశారు. కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదు. పారసైట్ వంటి సినిమాలు ఆస్వాదించాలంటే నిర్దిష్ట ఆలోచనా పరిధి అవసరం. బహుశా మీరు అలాంటి దృక్పథంతో లేరేమో. యావత్ ప్రపంచం మెచ్చుకున్న ఓ బృహత్తర చిత్రాన్ని మీరు తేలిగ్గా తీసి పారేశారు. ఇది మీకు సరికాదు. భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రతినిధిలాంటి మీరు మమ్మల్నందరినీ మీ వ్యాఖ్యలతో బాధించారనడం సబబుగా ఉంటుంది. ఇక నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే… మీ సినిమాలేవీ ప్రపంచ వేదికలపై ప్రశంసలకు దరిదాపుల్లోకి కూడా రావని భావిస్తున్నాను. యావత్ సినీ ప్రపంచం సమష్టిగా గౌరవించిన ఓ చిత్రంపై విమర్శలు చేసే హక్కు మనకు లేదనుకుంటున్నా. ముఖ్యంగా ఒక సామాజిక మాధ్యమంలో ఇది తగదు. చివరగా చెప్పాలంటే ఎవరి అభిప్రాయాలకు వాళ్లు అర్హులని భావిస్తాను. ఆల్ ది బెస్ట్” అంటూ విమర్శించారు.