ముంబయి: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌ను ఆస్ట్రేలియాతో జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేయాలని సునిల్ గావస్కర్ సూచించారు. 6, 7 స్థానాల్లో కాకుండా 4, 5 స్థానాల్లో ఆడించాలని కోరారు. న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీసుల్లో బీసీసీఐ సెలక్టర్లు పంత్‌కు అవకాశం ఇవ్వలేదు. టెస్టుల తర్వాత విశ్రాంతినిచ్చారు. ఇప్పటి వరకు కెరీర్‌లో మూడు వన్డేలు ఆడిన రిషభ్ పంత్ పెద్దగా రాణించలేదు. రెండు ఇన్నింగ్సుల్లో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. టెస్టు క్రికెట్‌లో మాత్రం దుమ్మురేపాడు. శతకాలు బాదేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో 159 పరుగులతో అజేయంగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాడు. సిరీస్‌లో 350 పరుగులతో పుజారా తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ‘రిషభ్ పంత్ ఉండాలనే చెబుతా. టాప్ ఆర్డర్‌లో అతడి ఎడమచేతి వాటం జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఉపఖండంలో ఆస్ట్రేలియాతో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో అతడిని ఎంపిక చేయాలి. పంత్‌ను 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కు దింపి అదనపు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఆడుతున్నాడో తెలుస్తుంది. 6, 7 స్థానాల్లో ఆడిస్తే అతడు భారీ షాట్లకే మొగ్గుచూపుతాడు. అదికాదుగా మనకు కావాల్సింది’ అని సునిల్ గావస్కర్ అన్నారు.