ఆపదలో చిక్కుకున్న భారత విమానాన్ని కాపాడడానికి పాకిస్థానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒకరు మానవీయ దృక్పథంతో వ్యవహరించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.ఆర్థికంగా ఎంతో నష్టదాయకం అని తెలిసి కూడా భారత్ పై అక్కసుతో పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.అయితే జైపూర్ నుంచి ఒమన్ దేశానికి వెళుతున్న ఓ విమానం పాక్ గగనతలం సమీపం నుంచి వెళుతుండగా మెరుపుల తాకిడికి గురైంది. దాంతో 36 వేల అడుగుల ఎత్తులో వెళుతున్న విమానం కాస్తా ఒక్కసారిగా రెండు వేల అడుగులు కిందికి జారిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలెట్ వెంటనే “మేడే మేడే” అంటూ ఎమర్జెన్సీ సందేశం పంపాడు.ఈ ప్రమాద సంకేతాలను పాకిస్థాన్ లోని ఓ ఎయిర్ పోర్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించి, సదరు భారత విమానానికి దిశానిర్దేశం చేశారు. ఆ విమానాన్ని పాక్ గగనతలంలోకి అనుమతించడం ద్వారా మెరుపుల ప్రభావం నుంచి రక్షించగలిగారు. తద్వారా ఆ విమానం ముప్పు నుంచి బయటపడి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది.