న్యూ ఢిల్లీ:పాక్ కోసం గూఢచర్యం వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే. హర్యానా, పంజాబ్, యూపీలో దాదాపు 16 మంది గుఢచారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో విద్యార్థులు, యూట్యూబర్, వ్యాపారవేత్త, గార్డ్, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. తాజాగా మరో యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐ సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో యూట్యూబర్ జస్బీర్ సింగ్ ను పంజాబ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రూప్‌నగర్ జిల్లాలోని మహలాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్‌ను మొహాలీలో స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ అదుపులోకి తీసుకుంది. గూఢచర్యం కేసులో గత నెలలో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టైన విషయం తెలిసిందే. జ్యోతితో జస్బీర్ సింగ్‌కు సంబంధాలు ఉన్నట్లు కూడా అధికా రులు గుర్తించారు. పాకిస్థానీ నిఘా ఏజెంట్లతో అతడు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. పంజాబ్ పోలీసుల ప్రకారం.. జస్బీర్ సింగ్‌కు పాక్ నిఘా అధికారి షకీర్ అలియాస్ జట్ రాంధావాతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేస్తున్నారు. జస్బీర్.. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ మాజీ అధికారి డానిష్‌తో కూడా సంబంధాలు కొనసాగించినట్లు సమాచారం. డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు జస్బీర్ హాజరైనట్లు కూడా అధికారులు తెలిపారు. అక్కడ పాక్ ఆర్మీ సిబ్బంది, వ్లాగర్లతో సంభాషించినట్లు కూడా చెప్పారు. అంతేకాదు 2020, 2021, 2024లో మూడు సార్లు పాక్‌కు వెళ్లి వచ్చినట్లు కూడా అధికా రులు గుర్తించారు. జస్బీర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌కు పంపగా.. వాటిలో పాక్‌కు చెందిన అనేక కాంటాక్ట్ నంబర్లు బయటపడ్డాయి. జ్యోతి అరెస్ట్ తర్వాత అప్రమత్తమైన జస్బీర్.. ఐఎస్ఐ కార్యకర్తలతో జరిపిన కమ్యూనికేషన్‌కు సంబంధించిన ఆనవాళ్లను తొలగించేందుకు యత్నించినట్లు కూడా అధికారులు గుర్తించారు. జస్బీర్.. ‘జాన్ మహల్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు. అతడికి యూట్యూబ్‌లో 1.1 మిలియన్స్ సబ్‌స్రైబర్స్ ఉన్నారు.