జమ్మూ-కశ్మీర్: జమ్మూ-కశ్మీర్ ,హంద్వారా జిల్లాలో క్రల్ గుండ్ వద్ద గురువారం సంభవించి ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతం చేయటంతో బాటు ప్రత్యర్థుల నుంచి భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. క్రల్ గుండ్ పరిసరాల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందటంతో పదాతి దళం, కశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలు ఆ ప్రాంతంలో గాలింపులు ఆరంభించాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఉగ్ర వాదులు విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి.ఉగ్రవాది ఒకరు హతమయ్యారు. నిషేధిత సాహిత్యంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. హతుడి గురించి మరింత సమాచారం లభించాల్సి ఉందన్నారు. ఉగ్రవాదులు తప్పించుకుని పోయే అవకాశాలున్నందున గాలింపుల్ని తీవ్రం చేసామని వివరించారు.