న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో శుక్రవారం చోటు చేసుకున్న మారణ హోమంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. రెండు మసీదుల్లో ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడడంతో 49 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన తననెంతో కలచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని కోహ్లీ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ దాడి నుంచి బంగ్లాదేశ్ ఆటగాళ్లు తప్పించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, బంగ్లా జట్టు సభ్యులు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించాడు. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఈ సంఘటన పట్ల విస్మయం వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నానని, మసీదుల్లో కాల్పులకు తెగబడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నాడు. మరో వైపు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ల మధ్య శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడో టెస్టును రద్దు చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.