ఢిల్లీ : కనీస ఆదాయ పథకం (న్యాయ్) వల్ల పెద్ద
ఎత్తున నగదు చలామణీలోకి వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.
ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దేశంలోని పేదలకు
డబ్బులు ఇవ్వడం, పెద్ద నోట్ల రద్దు వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం
ఈ పథకం లక్ష్యాలని వివరించారు. పెద్ద నోట్ల రద్దుతో పాటు వస్తు సేవా పన్ను (జీఎస్టీ)
వంటి విధానాలతో మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ నుంచి ధనాన్ని నిర్మూలించిందని
ఆరోపించారు. గత అయిదేళ్లలో మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి
అంతా లాక్కుందని, అలాంటి వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పథకానికి న్యాయ్
అని పేరు పెట్టామని వివరించారు. ఈ పథకం ప్రధాని గుండెల్లో రైళ్లు
పరిగెత్తిస్తోందని రాహుల్ ఎద్దేవా చేశారు.