న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధంగా ఉన్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు. గురువారం జరిగిన జర్నలిస్టుల యాప్ ప్రారంభోత్సవంలో ప్రసంగించారు. ‘ ప్రత్యక్ష ప్రసారాలపై సహ న్యాయమూర్తులతో చర్చిస్తాను. రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలు అన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసాం. ఒక జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం జర్నలిస్టులు పడుతున్న బాధలు నాకు తెలుసు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన దశలో జర్నలిస్టులు కోర్టు కార్యకలాపాల కోసం ఎటువంటి సమస్యను ఎదుర్కోకూడదు. ఆ దృష్టితోనే ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాం. మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తాం. అక్రిడేషన్ల మంజూరులో ఎవరికి అన్యాయం జరగకుండా హేతుబద్ధతతో వ్యవరించేలా.. చర్యలు కుంటామన్నా’రు. జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్లతో కూడిన కమిటీ ఈ యాప్ రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే యాప్ను సుప్రీంకోర్టు సాంకేతిక బృందం రూపొందించిందని చెప్పారు. సుప్రీంకోర్టు రోజువారి కార్యకలాపాలు ఇకపై ఉన్న చోటు నుంచే పొంద వచ్చని అన్నారు. కోర్టులో జరిగే కార్యకలాపాలు పార దర్శకంగా ఉండేదుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించు కోనున్నట్లు చెప్పారు.