సొమ్మొకడిది… సోకొకడిది

సొమ్మొకడిది… సోకొకడిది

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తొలి పది సంవత్సరాల పాలనలో దేశంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థ అక్షరాలా రూ.16.11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన బ్యాంకు రుణాల విలువ రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఈ మాత్రానికే యూపీఏ-2 ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందంటూ అప్పటి ప్రతిపక్ష ఎన్డీఏ నానా యాగీ చేసింది. 2008లో యూపీఏ ప్రభుత్వం అరవై వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాత్రమే రద్దు చేసింది. దీనికే ఆ నాడు ఎన్డీఏ, దానికి బాకా ఊదిన కొన్ని పత్రికలు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టాయి. ఇది ప్రజాకర్షక దుష్ప్రవర్తన అంటూ నిందలు వేశాయి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిన రుణాలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలవి కావు. బడా కార్పొరేట్‌ శక్తులు, మోసగాళ్లవి. వీరిలో అనేక మంది మోడీకి సన్నిహితులని తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం రద్దు చేసిన రూ.16.11 లక్షల కోట్ల రుణాలతో ఆ పది సంవత్సరాల కాలంలో బడ్జెట్లలో విద్యకు కేటాయించిన మొత్తాన్ని పోల్చి చూస్తే అందులో 40 శాతం కంటే తక్కువగానే ఉంది. ఆరోగ్య రంగానికి జరిపిన కేటాయింపులైతే రుణ మాఫీ మొత్తంలో సగమే. ఈ నేపథ్యంలో దేశంలోని బ్యాంకులు అందించిన రుణాలు, వాటిలో పారు బకాయిలపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి, ప్రసారభారతి మాజీ సీఈఓ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు జవహర్‌ సిర్‌కార్‌ ‘ది వైర్‌’ పోర్టల్‌కు అందించిన కథనం    గత పది సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ 1,600 చట్టాలను మందబలంతో రద్దు చేశారు. అది కూడా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. కానీ బ్యాంక్‌ రుణాల రద్దుకు వీలు కల్పిస్తున్న నిబంధనలను మాత్రం సవరించలేదు. పునఃపరిశీలించనూ లేదు. ఇప్పుడు బ్యాంకింగ్‌ చట్టాలకు సవరణలు చేస్తున్నప్పటికీ ఈ అంశాలను వాటిలో ప్రస్తావించలేదు. సాధారణంగా బ్యాంక్‌ రుణాలలో పారు బకాయిలు 0.5 నుండి 2 శాతం వరకూ ఉంటాయి. దక్షిణ కొరియా, కెనడా, స్కాండినేవియన్‌ దేశాల్లో ఇది 0.3 శాతమే. స్విట్జర్లాండ్‌, అమెరికాల్లో బ్యాంక్‌ రుణాలలో రానిబాకీలు ఒక శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. జర్మనీ, జపాన్‌లో ఇది 1.25 శాతంగా ఉంది. అనేక యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో కూడా పారు బకాయిలు రెండు శాతం లోపే ఉన్నాయి. ఇటలీలో మాత్రం ఇది 2.8 శాతం. బ్యాంక్‌ రుణాలలో పారు బకాయిల వాటా విషయానికి వస్తే చైనాలో 1.66 శాతం, మలేసియాలో 1.72 శాతం, ఇండొనేషియాలో 2.15 శాతం, వియత్నాంలో 2.32 శాతం, బ్రెజిల్‌లో 2.64 శాతం, థారులాండ్‌లో 2.84 శాతంగా ఉంది. బ్యాంక్‌ రుణాలలో పారు బకాయిలు అధికంగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, తూర్పు యూరోపియన్‌ దేశాలు ఈ కోవలోకి వస్తాయి. అక్కడ పారు బకాయిల వాటా సుమారు ఐదు శాతంగా ఉంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos