ముక్క లేనిదే ముద్ద దిగని హైదరాబాదీలు

ముక్క లేనిదే ముద్ద దిగని హైదరాబాదీలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ వాసులు చికెన్‌ను తెగ లాగించేస్తున్నారు. ముక్క లేనిదే ముద్ద ముట్టడం లేదంట.. టిఫిన్‌లోకి, లంచ్‌లోకి.. డిన్నర్‌లోకి సందర్భమేదైనా చికెన్ ఉండాల్సిందే. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నవంబర్, డిసెంబర్ నెలల్లో చికెన్ వాడకంలో దేశంలోనే హైదరాబాద్ మొదటిస్థానంలో నిలిచిందట. ఇందుకు కొన్ని ప్రత్యేక కారణాలూ ఉన్నాయి. చికెన్ వెరైటీలకు హైదరాబాద్ పెట్టింది పేరని మనందరికీ తెలుసు. దేశ వ్యాప్తంగా ఒక్క హైదరాబాద్‌లోనే 20కి పైగా చికెన్ వెరైటీలు చేస్తున్న హోటళ్లున్నాయి. దీంతో నగరవాసులు చికెన్‌ను మస్తుగా లాగించేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఉండే నగరవాసులు ఆన్‌లైన్‌లోనూ, రెస్టారెంట్లలోనూ చికెన్ వెరైటీలను ఆర్డర్ చేస్తున్నట్లు ఫుడ్ డెలివరీ సంస్థల సర్వేలు చెబుతున్నాయి. కరోనా తర్వాత దేశంలోనే అత్యధిక చికెన్ వినియోగం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. రోజువారీగా 6 లక్షల కిలోల చికెన్‌ను వినియోగిస్తున్నారు. ఢిల్లీలో 5.5 లక్షల కిలోలు, బెంగుళూరులో 5 లక్షల కిలోల చికెన్‌ను విక్రయిస్తున్నట్లు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పౌల్ట్రీలు అధికంగా ఉన్నాయి. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల చికెన్ విక్రయాలు బాగా జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు సైతం ఎగుమతులు చేస్తున్నారు. ఇక మటన్ విషయానికొస్తే.. విక్రయాలు లక్షల కేజీలు దాటడం లేదు. ఎందుకంటే మటన్ ధర చికెన్ కంటే ఎక్కువ. అలాగే ఈ మధ్య హైదరాబాద్‌లో చేపలు, రొయ్యల వినియోగం కూడా పెరిగిందంట. దీనిని బట్టి హైదరాబాద్ నగరవాసులు నాన్‌వెజ్‌ను ఎంత ఇష్టపడుతున్నారో తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos