తాడేపల్లి : తితిదే భూముల విక్రయంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వేలానికి సంబంధించి ఎలాంటి విధివిధానాలూ రూపొందించలేదని తెలిపారు. ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తదుపరి బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ‘శ్రీవారి ఆస్తుల విషయంలో ఎలాంటి అసత్యాలూ ప్రచారం చేయొద్దు. తితిదే భూములు అమ్మాలంటే కేవలం రూ.కోటీ 53 లక్షల విలువైన భూములే అమ్మాలా? గత ప్రభుత్వం ఎన్నో విలువైన భూములను అమ్మేసింది. కేవలం రాజకీయ వ్యతిరేకతతోనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం హయాంలో సదావర్తి భూముల అమ్మకానికి పెడితే కోర్టుల ద్వారా అడ్డుకున్నది మేమే. తితిదేకి భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి బాధ్యతగా ఖర్చు చేస్తాం. తితిదే ఆస్తులను కాపాడాలనేదే మా ఉద్దేశం’ అని సుబ్బారెడ్డి వివరించారు.
అమ్మకం కొత్తేం కాదు…
‘తితిదేలో అన్యాక్రాంతమైన భూములు, నిరుపయోగంగా ఉన్న ఆస్తుల అమ్మకం కొత్తేం కాదు. చదలవాడ కృష్ణమూర్తి తితిదే ఛైర్మన్గా ఉన్నప్పుడే భూములు విక్రయించాలని తీర్మానం చేశారు. తిరుపతికి దూరంగా ఉన్నాయని వారు కారణంగా చూపారు. ఇప్పుడు మాపై విమర్శలు చేస్తున్న భాజపా వాళ్లు కూడా అప్పట్లో బోర్డు సభ్యులుగా ఉన్నారు. అయినా మేం వేలానికి సంబంధించి పూర్తిగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అధికార బృందాన్ని పంపించి మార్కెట్ విలువ, అక్కడి పరిస్థితుల గురించి రోడ్డు మ్యాప్ తయారు చేయాలని మాత్రమే బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. వేలం వేయాలని ఎక్కడా మేం ఉత్తర్వులు ఇవ్వలేదు. అక్కడి పరిస్థితులపై నివేదిక వచ్చాక తదుపరి బోర్డులో నిర్ణయం తీసుకుందామని మాత్రమే నిర్ణయం తీసుకున్నాం. ఏ నిర్ణయమూ తీసుకోకముందే రాద్ధాంతం చేస్తున్నారు. పాత తీర్మానంపై మాత్రమే సమీక్షించాం. ఆస్తులను అమ్మకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటాం. ధార్మిక పెద్దలు, నిపుణుల సలహాలు తీసుకుంటాం. భూముల అన్యాక్రాంతం కాకూడదనేదే మా ఉద్దేశం’ అని సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు.