ఖాట్మండు: హిమాలయ దేశం నేపాల్‌లో యువతరం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియాపై విధించిన నిషేధంతోమొదలైన నిరసనలు.. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారి దేశాన్ని అల్లకల్లోలం చేశాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. రెండు రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 400 మందికి పైగా గాయపడ్డారు. ‘సోషల్ మీడియాపై నిషేధాన్ని ఆపండి, అవినీతిని ఆపండి’ అంటూ వేలాది మంది యువత సోమవారం వీధుల్లోకి వచ్చారు. 24 గంటల్లోనే ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖాట్మండు వీధులు రణరంగాన్ని తలపించాయి. నిరసనకారులు పార్లమెంటుతో పాటు ప్రధాని ఓలీ, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ప్రైవేట్ నివాసాలకు నిప్పుపెట్టారు. ఎదురొచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగుతూ, ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు. నిజానికి ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, యువత శాంతించలేదు. నిరసనల సందర్భంగా 19 మంది పౌరులు మృతి చెందడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా యువత తమ నిరసనను కొనసాగించింది. అధికారంలో ఉన్నవారి పిల్లలకు అన్యాయంగా అవకాశాలు కల్పిస్తున్నారంటూ ‘#NepoBabies’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రధాని రాజీనామా చేసినప్పటికీ, దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. అధ్యక్షుడి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తున్నా, త్వరలోనే అది కూడా కూలిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సైన్యం పాలన చేపట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.