గుజరాత్‌లో పేపర్‌ లీకేజీల బాగోతం

గుజరాత్‌లో పేపర్‌ లీకేజీల బాగోతం

న్యూఢిల్లీ : పేపర్ లీకేజీల కారణంగా పరీక్షలు రద్దు కావడమే కాదు. లక్షలాది మంది అభ్యర్థుల ఆశలు కూడా ఆవిరవుతున్నాయి. గత ఐదు సంవత్సరాల కాలంలో పేపర్ లీకేజీలతో పదిహేను రాష్ట్రాలలో 41 నియామక పరీక్షలు రద్దయ్యాయి. ఫలితంగా సుమారు 1.4 కోట్ల మంది ఉద్యోగార్థులు తీవ్రమైన నిరాశానిస్పృహలకు గురయ్యారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో, బీజేపీ ప్రభుత్వ ఏలుబడిలో అనేక ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. పేపర్ లీకేజీ కుంభకోణం కారణంగా మోడీ సన్నిహితుడు, గుజరాత్ సెకండరీ సర్వీస్ సెలక్షన్ బోర్డు ఛైర్మన్ అశిత్ ఓరా తన పదవికి రాజీనామా చేశారు. పేపర్ లీకేజీ బాగోతంలో ఓ ప్రింటింగ్ ప్రెస్ ప్రమేయం ఉన్నదని వార్తలు వచ్చాయి. ఈ ప్రెస్లోనే గతంలో మోడీ రాసిన ఓ పుస్తకాన్ని అచ్చు వేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్లోనే కాదు…బీజేపీ మోడల్ రాష్ట్రమైన గుజరాత్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ రాష్ట్రంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో భారీ కుంభకోణాలే వెలుగు చూశాయి. నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు గత సంవత్సరం ఫిబ్రవరిలో గుజరాత్ ప్రభుత్వం శాసనసభలో ఓ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలో గడిచిన 11 సంవత్సరాల్లో 11 పేపర్ లీకేజీ కేసులు నమోదయ్యాయని, 201 మంది నిందితులపై కేసులు నమోదు చేశామని, 10 కేసుల్లో చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయని బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా హోం మంత్రి చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో పేపర్ లీకేజీ మూలాలు బాగా వేళ్లూనుకుపోయాయని, వాటికి బీజేపీ పాలనతో సంబంధం ఉన్నదని మాత్రం ఆయన చెప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలన్నింటినీ గుజరాత్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (జీఎస్ఎస్ఎస్బీ) నిర్వహిస్తుంది. అనేక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను అహ్మదాబాద్లోని సూర్యా ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్లోనే ముద్రించారు. అక్కడి నుండే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి.
ప్రశ్నాపత్రాన్ని అమ్ముకున్నారు.2021లో హెడ్ క్లర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయింది. ఈ ఉదంతం ప్రభుత్వాన్ని కుదిపేయడంతో ఓరా తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరీక్షకు 88 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపణలు రావడంతో చివరికి పరీక్షను రద్దు చేశారు. ఈ కేసులో గుజరాత్ పోలీసులు 14 వేల పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తూనే ఉంది. సూర్య ప్రెస్లోనే పేపర్ లీక్ అయిందని పోలీసులు గుర్తించారు.
అవినీతిపరుడికి అందలం
2004-05లోనే సూర్య ప్రింటింగ్ ప్రెస్ను గుజరాత్ యూనివర్సిటీ బ్లాక్లిస్టులో పెట్టింది. ఈ ప్రెస్ రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు పరీక్షా పత్రాలు ముద్రించి ఇస్తుంది. ప్రెస్ యజమాని ముద్రేష్ పురోహిత్కు ఆర్ఎస్ఎస్, బీజేపీతో సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణను ఆయన తోసిపుచ్చారు. కాగా అరెస్టు నుండి తప్పించుకునేందుకు ముద్రేష్ కోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందారు. ఇక జీఎస్ఎస్ఎస్బీ ఛైర్మన్గా వ్యవహరించిన ఓరా పదవీకాలంలో రెండు ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. ఆయన హయాంలో పరీక్షా ఫలితాల తారుమారు సహా 61 ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆయనకు బీజేపీ ప్రభుత్వం రెండోసారి అదే పదవిని కట్టబెట్టింది. బీజేపీ పాలనలో ఓరా అనేక పదవులు నిర్వహించారు. అహ్మదాబాద్ మేయర్గా, మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా పనిచేశారు.
ప్రభుత్వ ప్రమేయంతోనే : కాంగ్రెస్
గత దశాబ్ద కాలంలో ప్రభుత్వోద్యోగాలలో నియామకాలకు సంబంధించి 14 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ దోషీ చెప్పారు. 2020-21, 2022-23 మధ్యకాలంలో గుజరాత్లో విద్యార్థుల ఆత్మహత్యలు 21 శాతం పెరిగాయి. పరీక్షా పత్రాల లీకేజీలు కూడా ఆత్మహత్యలకు కారణమయ్యాయి. ప్రభుత్వ ప్రమేయం లేకుండా పేపర్ లీకేజీలు ఎలా జరుగుతాయని దోషీ ప్రశ్నించారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీలు వ్యవస్థీకృత నేరంగా మారాయని మండిపడ్డారు. ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే రేటు నిర్ణయిస్తారని, లక్షలాది రూపాయలకు ప్రశ్నాపత్రాన్ని అమ్ముకుంటారని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos