నీట్‌ పరీక్షలో 1563 మంది విద్యార్థుల గ్రేస్‌ మార్కులు రద్దు

నీట్‌ పరీక్షలో 1563 మంది విద్యార్థుల గ్రేస్‌ మార్కులు రద్దు

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాల్లో 1,563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకావం కల్పిస్తామని తెలిపింది. 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి. నీట్ పరీక్ష నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలపై సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. హరియాణాలోని ఒకే పరీక్ష కేంద్రం నుంచి 67 మంది విద్యార్థులు 1వ ర్యాంకు సాధించారని, ఇది అవకతవకలు జరిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నాయి. అవకతవకల ఆరోపణలపై స్పందించి కేంద్ర విద్యాశాఖ గతవారం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. ఈ కమిటి గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నిర్ణయాలను కేంద్రం గురువారం సుప్రీంకోర్టు కు తెలియజేసింది. ‘పరీక్ష సమయంలో కోల్పోయిన సమయం వల్ల గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. వారికి రీ-టెస్ట్లో పాల్గొనే అవకాశం కల్పిస్తాం. జూన్ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తాం. ఆ తర్వాతే కౌన్సెలింగ్ ఉంటుంది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయకూడదని అనుకునే వారు.. గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో జులై 6 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్కు వెళ్లొచ్చు’ అని సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడించింది. ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిపి వెబ్ కౌన్సెలింగ్పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.నీట్ ప్రవేశ పరీక్షను గత మే 5న దాదాపు 24 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే, 2019 నుంచి ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, టాపర్లుగా నిలవడంతో నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు మొదలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos