న్యూ ఢిల్లీ : ఓటుకు కోట్లు కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలని కోరుతూ అత్యున్నత న్యాయ స్థానంలో దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం పరిశీలించింది. విచారణను వచ్చే జూలై 14కు వాయిదా వేసింది. కక్షిదారు శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘ఓటుకు కోట్లు కేసు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారు. అయినా ఆ కేసులో ఏసీబీ చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదు. చంద్రబాబు పేరు చేర్చి సీబీఐ దర్యాప్తు జరపాలని కోర్టును’ కోరారు. రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.