నాగ్‌పూర్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. నాగ్‌పూర్‌లో శాంతి భద్రతల పరిస్థితి అదుపులో ఉందని, పలు సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని బుధవారం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 11 ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని అన్నారు. మధ్యాహ్నం పరిస్థితిని సమీక్షించి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని పోలీస్ కమిషనర్ రవీందర్ కుమార్ సింగల్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 2,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించామని అన్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టి), అల్లర్ల నియంత్రణ పోలీసులు (ఆర్‌సిపి) డిసిపి ర్యాంక్ అధికారి నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయని అన్నారు. హింసాకాండకు సంబంధించి 50 మందిని అదుపులోకి తీసుకున్నామని, 6ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని సీనియర్ అధికారులు తెలిపారు. 1200 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మరో 200 మంది కోసం గాలిస్తున్నామని అన్నారు.
ప్రధాన నిందితుడు ఫహీమ్ ఖాన్ అరెస్ట్ : పోలీసులు
మరోవైపు, ఈ హింసాకాండలో ప్రధాన నిందితునిడు ఫహీమ్ ఖాన్‌ను గుర్తించామని పోలీసులు ఆరోపించారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన స్థానిక నేత అయిన ఫహీమ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నామని, శుక్రవారం వరకు కస్టడీలో ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఈ హింసాకాండకు బాధ్యులు ఒకరేనా లేదా ఏదైనా సంస్థ ఉందా అన్న అంశంపై దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. జౌరంగజేబు సమాధిని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ విహెచ్‌పి, బజరంగ్‌దళ్ సోమవారం నిర్వహించిన ప్రదర్శన నాగ్‌పూర్‌లో హింసాకాండకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ హింసాకాండలో పలు వాహనాలు దగ్ధం కాగా, 34 మందికి పైగా పోలీసులు సిబ్బంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు కచేసేందుకు పలు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం కర్ఫ్యూ విధించింది.