ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలైన తెదేపా,వైసీపీలకు ధీటుగా జనసేన కూడా ప్రచారాలు,వ్యూహాలు ముమ్మరం చేసింది.మెగా బ్రదర్ నాగబాబు కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఈ క్రమంలో కొద్ది నెలలుగా యూట్యూబ్‌లో ఛానెల్ తెరచి తెదేపా అధినేత చంద్రబాబు,కుమారుడు లోకేశ్,చంద్రబాబు వియ్యంకుడు బాలయ్యాపై విమర్శలు గుప్పించిన మెగా బ్రదర్ నాగబాబు మరోసారి తెదేపాపై పదునైన విమర్శలు చేశారు.అందుకు సంబంధించి నాగబాబు మరో వీడియో విడుదల చేశారు.జనసేన పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు తెదేపా మహిళ నేత సాధినేని యామినిని సామాజిక మాధ్యమాల్లో విమర్శించారనే కారణంగా జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారంటూ ఆరోపించారు.అధికార పార్టీ ఒత్తిడి వల్లే పోలీసులు జనసేన కార్యకర్తలతో అత్యంత పాశవికంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు.అధికారం చేతిలో ఉందని తెదేపా తమను విమర్శించిన,తమకు అడ్డు వచ్చిన పార్టీల నేతలు,కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందంటూ ఆరోపించారు. ఇటువంటి కేసులకు జనసేన సైనికులు భయపడతారని అధికార తెదేపా నేతలు భ్రమ పడుతున్నారని ఇంతకు పదింతల ఆవేశం,శక్తితో మీపై తిరగబడతామన్నారు. నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తే.. చావడానికి సిద్ధంగా ఉన్నానని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.తాను జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోలేదని – అయితే జనసేన పార్టీ కోసం ఏమైనా చేస్తానని నాగబాబు అన్నారు. జనసేన పార్టీ కోసం తాను ఎంతకైనా తెగిస్తానని హెచ్చరించారు..