ముంబై: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. కూటమి ధర్మాన్ని అతి క్రమిస్తే అందులోంచి బయటకు వచ్చేందుకు తాము సిద్ధమని ప్రకటించటంతో మహావికాస్ అఘాడీ కూటమిలో చీలిక అనివార్యంకానుంది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలను సంప్రదించకుండా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో నిర్ణయం ఎలా తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాలాసాహెబ్ థోరట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది స్త్రీ పురుషులు, ట్రైబల్-నాన్ ట్రైబల్ మధ్య జరుగుతున్న పోరు కాదని ఆయన పేర్కొన్నారు. అసలు ముర్ముకు శివసేన ఎందుకు మద్దతు ప్రకటించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీకే చెందిన మరో నేత మిలింద్ దేవ్రా కూడా శివసేన తీరుపై మండిపడ్డారు. శివసేన తీరు ఇతర పార్టీలకు ప్రయోజనం చేకూరేలా ఉందని విమర్శించారు. కూటమి ధర్మాన్ని అతిక్రమిస్తే ఎలాంటి సవాలునైనా ఎదుర్కొ నేం దుకు సిద్ధమని స్పష్టం చేసారు.