మస్క్‌తో ట్రంప్ కయ్యం: ఫీజు చెల్లిస్తే మధ్యవర్తిత్వం వహిస్తానన్న రష్యా మాజీ అధ్యక్షుడు

మస్క్‌తో ట్రంప్ కయ్యం: ఫీజు చెల్లిస్తే మధ్యవర్తిత్వం వహిస్తానన్న రష్యా మాజీ అధ్యక్షుడు

మాస్కో:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రస్తుతం తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ వీరిద్దరి మధ్య ‘శాంతి ఒప్పందం’ కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు.ఈ మధ్యవర్తిత్వానికి ‘సముచితమైన రుసుము’ తీసుకుంటామని, ఆ రుసుమును స్టార్‌లింక్ షేర్ల రూపంలో చెల్లిస్తే అంగీకరిస్తామని మెద్వెదేవ్ పేర్కొన్నారు. “సముచితమైన రుసుముతో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిఫలంగా స్టార్‌లింక్ షేర్లను స్వీకరిస్తాం. మిత్రులారా, మీరిద్దరూ గొడవపడకండి” అని మెద్వెదేవ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనికి ఎలాన్ మస్క్ నవ్వుతున్న ఎమోజీతో స్పందించారు.మెద్వెదేవ్ వ్యాఖ్యలకు ముందు, రష్యా చట్టసభ సభ్యుడు డిమిత్రి నోవికోవ్ మాట్లాడుతూ, ఎలాన్ మస్క్ అవసరమైతే రష్యాలో రాజకీయ ఆశ్రయం కోరవచ్చని సూచించారు. “మస్క్‌కు వేరే ప్రణాళిక ఉందని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఆయనకు రాజకీయ ఆశ్రయం అవసరమైతే, రష్యా తప్పకుండా ఆశ్రయం కల్పిస్తుంది” అని నోవికోవ్ రష్యన్ వార్తా సంస్థ టాస్‌తో అన్నారు.మరో రష్యన్ సెనేటర్, ఒకప్పుడు దేశ అంతరిక్ష కార్యక్రమాన్ని నిర్వహించిన డిమిత్రి రోగోజిన్ “మీరు అమెరికాలో అధిగమించలేని సమస్యలను ఎదుర్కొంటే, మా వద్దకు రండి. ఇక్కడ మీరు నమ్మకమైన సహచరులను, సాంకేతిక సృజనాత్మకతకు పూర్తి స్వేచ్ఛను పొందుతారు” అని మస్క్‌ను ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos