పాట్నా: ‘దుర్గామాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఈనెల 26న పరిస్థితి అదుపు తప్పడంలో స్థానిక పోలీసులే తొలుత కాల్పులు జరిపారు. ఆ తర్వాత తమ జవాన్లు గాలిలోకి కాల్పులు జరిపార’ని సీఐఎస్ఎఫ్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం నిమిజ్జనం ఊరేగింపు వేగాన్ని తగ్గించే ప్రయత్నంలో పోలీసులు, భక్తులకు మధ్య వాగ్యుద్ధం మొదలైంది. అప్పుడు కొందరు స్థానికులు పోలీసుల పై రాళ్లు రువ్వారు. దీనికి ప్రతిగా స్థానిక పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. దరిమిలా ఆగ్రహించిన స్థానికులు మరింత ఉధృతంగా రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు సీఐఎస్ఎఫ్కు చెందిన ఎం.గంగయ్య అనే వ్యక్తి ఇన్సాస్ రైఫిల్ నుంచి గాలిలోకి 13 రౌండ్లు కాల్పులు జరిపారు. సంఘ వ్యతిరేక శక్తులే కాల్పులు బీహార్ పోలీసులు కొట్టి పారేశారు. పూరబ్ సరాయ్ పోలీస్ స్టేషన్ నుంచి 100 తూటాలు, రెండు మ్యాగజైన్లు మాయమైనట్టు ముంగెర్ పోలీసులు శుక్రవారం తెలిపారు. పోలీసు చర్యపై అసంతృప్తితో ఉన్న ఆందోళనకారులు పూరబ్ సరాయ్ పోలీస్ స్టేషన్ను గురువారం ధ్వంసం చేసారు.