సమాజ్‌వాదీ పార్టీ పూర్వ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేస్తున్న
వ్యాఖ్యలు ఈ మధ్య వివాదాస్పదమవుతున్నాయి. లోక్‌సభలో బుధవారం దాదాపు వీడ్కోలు సభలాగా
అందరూ ప్రసంగించారు. ములాయం మాట్లాడుతూ ఈ సభలోని వారంతా మళ్లీ ఎన్నికై రావాలన ఆకాంక్షించారు.
అలాగే ప్రధాని పదవిని మోదీ మరోసారి అధిష్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై
సర్వత్రా వివాదం నెలకొంది. వయసు మీద పడుతుండడంతో ములాయంకు జ్ఞాపక శక్తి క్షీణించిందని
సమాజ్‌వాదీ పార్టీ నాయకులు తెలిపారు. ‘ములాయం సింగ్ యాదవ్ తన చుట్టూ ఉన్న ప్రజలనే కాదు. కుటుంబ సభ్యులను కూడా గుర్తించని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన జ్ఞాపక శక్తి పూర్తిగా మందగించింది. ఆయన మాటల మధ్య పొందిక ఉండడం లేదు. మోదీ గురించి ఆయన అలా మాట్లాడడానికి అదే కారణమై ఉంటుంది’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ‘గత ఏడాది లక్నోలో ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయన ఇలాగే పొరపాటు వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అనుకొని శివపాల్ యాదవ్ పార్టీకి మద్దతివ్వాల్సిందిగా ప్రజలను కోరారు. ఇది సమాజ్‌వాది పార్టీ సమావేశం కాదంటూ ప్రేక్షకుల నుంచి అనేక మంది అరిచారు. దాంతో సర్దుకున్న ములాయం సింగ్ యాదవ్ ఆ పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించినందుకు తన సోదరుడిని అభినందిస్తున్నాను అని చెప్పారు’ అని ఎస్పీ సీనియర్ నాయకుడు వివరించారు. బుధవారం నాడు పార్లమెంట్ భవనం నుంచి బయటకు వస్తున్న ములాయం సింగ్ యాదవ్‌ను సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కలుసుకొని ‘మోదీ మరోసారి ప్రధాని కావాలని ఎందుకు కోరుకున్నారు ?’ అని ప్రశ్నించగా, ‘నేను అలాంటిదేమీ అనలేదే! మీరే ఏదో ఊహించుకుంటున్నారు!’ అని ములాయం వ్యాఖ్యానించడం కొసమెరుపు.