శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ‘అవంతిపురలో జవాన్ల మృతి వార్త నన్ను తీవ్ర కలవరానికి గురిచేసింది. ఈ దారుణ ఉగ్రదాడిని ఖండించడానికి మాటలు రావడం లేదు. ఈ మతిలేని ఉగ్రవాదానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలి?’ అని మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దాడిపై విచారం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా దారుణం. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ఒమర్ ట్వీట్ చేశారు. జమ్ముకశ్మీర్ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోని ఓ బస్సుపై ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.