అమరావతి: భావి తరాలకు ఉపయోగ పడే ప్రజా ఉద్యమంగా ఎన్నికలు జరగాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఆశించారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెదేపా నేతలతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చరిత్రలో తొలి సారిగా జనాభిప్రాయానికి అనుగుణంగా, రాగ ద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు అభివర్ణించారు. సుదీర్ఘ కసరత్తు తర్వాతే గెలుపు గుర్రాల్ని రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. టికెట్ రాని వారెవ్వరూ నిరాశ చెందకుండా పార్టీ ప్రచారంలో క్రియాశీలంగా పాల్గొనాలని, వారి సేవల్ని నాయకత్వం తప్పకుండా గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు. ముందు ముందు అందరికీ రాజ్యాధికారంలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామా ఇచ్చారు. అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలను కలుసుకోకుండా తాత్సారం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో పాటు, ఎవరూ చేయలేని అభివృద్ధి చేశామని చెప్పారు. ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలో లేనపుడు పదేళ్ల పాటు రాష్ట్రంలో జరిగిన అరాచకం అందరికీ తెలిసిందేనన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.