హైదరాబాద్ : కరోనాను అదుపు చేయడంలో సాధారణంగా వినియోగించే క్లోర్‌హెక్సిడైన్ మౌత్‌వా ష్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగాల్లో నిర్థారణయిందని.. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ హెచ్ఎస్జె ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, సిఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడించింది.
డాక్టర్ హెచ్ఎస్జె ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కు చెందిన డాక్టర్ ఆశిష్ జైన్ మాట్లాడుతూ.. ఈ అధ్యయనానికి డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ సహకారం అందించిందన్నారు. కరోనా వైరస్ ముందుగా మనిషి ముక్కు, గొంతులో చేరుతుందని, అక్కడి నుండి శరీరంలోకి వ్యాపిస్తోందని తెలిపారు.క్లోర్‌హెక్సిడైన్‌తో తయారైన మౌత్‌వాష్ తో నోటిని కడుక్కొని, పుక్కిలించినప్పుడు కరోనా వైరస్ చాలావరకు నశిస్తోందని, గొంతు నుంచి శరీరంలోకి వ్యాపించే అవకాశాలు తగ్గిపోతున్నాయని ఈ పరిశోధనలో వెల్లడయినట్లు వివరించారు. 30 సెకన్లపాటు క్లోర్‌హెక్సిడైన్ డైగ్లూకోనేట్ మౌత్‌వాష్ 0.2 శాతం కాన్సెంట్రేషన్ తో నోరు శుభ్రం చేసుకుంటే, 99.9 శాతం కరోనా వైరస్‌ను నిర్మూలించవచ్చని ల్యాబ్ పరీక్షల్లో నిర్థారణ అయినట్లు తెలిపారు. దీనిపై క్లినికల్ పరీక్షలను నిర్వహించాల్సి ఉందని డాక్టర్ ఆశిష్ జైన్ పేర్కొన్నారు.