న్యూఢిల్లీ: నైరుతి రాకపై ఐఎండీ ఇవాళ మరో అప్‌డేట్ ఇచ్చింది. రానున్న 4 లేదా 5 రోజుల్లో.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఇక ఈ యేడాది మే 27వ తేదీ వరకు నైరుతి కేరళ చేరనున్నట్లు కొన్ని రోజుల క్రితం ఐఎండీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఒకవేళ అనుకున్నట్లు నైరుతి కేరళకు వస్తే, 2009 తర్వాత కేరళకు నైరుతి చాలా ముందుగా వచ్చినట్లు భావిస్తున్నారు. రాబోయే 4, 5 రోజుల్లో కేరళను నైరుతి తాకే సందర్భాలు అనుకూలంగా ఉన్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. అనుకున్న దానికన్నా ముందే నైరుతి రుతు పవనాలు కేరళ తీరంతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాలకు చేరనున్నట్లు తెలుస్తోందని ఐఎండీ పేర్కొన్నది. కేరళలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ త్రిసూర్ జిల్లాలో 22 సెమీ వర్షపాతం నమోదు అయ్యింది. కన్నౌరు జిల్లాలో 18 సెమీ వర్షం కురిసింది.