న్యూఢిల్లీ: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్న బౌద్ డిస్టిల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ తనిఖీలు చేసింది. ఆ కంపెనీ డిస్టిల్లరీల నుంచి భారీ మొత్తంలో నగదును సీజ్ చేశారు. ఒడిశాలోని బొలన్గిరి, సంబల్పుర్తో పాటు జార్ఖండ్లోని రాంచీ, లోహర్దాగా లో ఉన్న కంపెనీలపై రెయిడ్ జరిగింది. అయితే అక్కడ ఆఫీసుల నుంచి గుట్టల కొద్దీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ అధికారులు ఆ నోట్ల కట్టలను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల కరెన్సీ కౌంటింగ్ పూర్తి అయ్యింది. కరెన్సీ కట్టలు ఎక్కువగా ఉన్న కారణంగా.. మెషీన్లు పనిచేయడం లేదని, ఆ మొత్తాన్ని లెక్కించేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు ఆదాయపన్నుశాఖ తెలిపింది.