ఢిల్లీ : చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రతి భారతీయుడు అత్యంత గర్వపడే రోజు ఇది’ అని చంద్రయాన్ 2 ప్రయోగం అనంతరం ట్విటర్ వేదికగా భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) మీద ప్రశంసలు కురిపించారు. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని ఇస్రో సోమవారం శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. దానిపై వరస ట్వీట్లతో మోదీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘మన చరిత్రలో అద్భుతమైన క్షణాలు ఇవి! చంద్రయాన్ 2 ప్రయోగం మన శాస్త్రవేత్తల నైపుణ్యాన్ని, శాస్త్ర రంగంలో కొంత పుంతలు తొక్కాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల నిబద్ధతను చూపిస్తోంది. ప్రతి భారతీయుడు ఈ రోజు చాలా గర్వంగా ఉన్నాడు. మనసులో, స్ఫూర్తిలో భారతీయత తొణికసలాడింది. చంద్రయాన్ 2 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం ఈ రోజు ప్రతి భారతీయుడి ఆనందానికి అత్యంత ముఖ్యకారణం అని మోదీ ట్వీట్లు చేశారు.