న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు గత మూడేళ్లలో రూ.295 కోట్లు ఖర్చయిందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. గురువారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో మోదీ పర్యటనలకు సంబంధించి ఏ దేశానికి వెళ్లినపుడు ఎంత ఖర్చయిందనే వివరాలను ఆయన వెల్లడించారు. 2021 నుంచి 2024 మధ్య కాలంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రూ.295 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో ఒక్క ఫ్రాన్స్ పర్యటన (2025) కే రూ.25 కోట్లు ఖర్చయిందని వివరించారు. 2023 జూన్ లో మోదీ అమెరికా పర్యటనకు రూ.22 కోట్లు ఖర్చయిందన్నారు. ఇటీవల మోదీ ఐదు దేశాలలో పర్యటించగా దీనికోసం రూ.67 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఈ ఏడాదిలో మోదీ మారిషస్, సైప్రస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలలో పర్యటించారు. ఈ దేశాలకు సంబంధించిన ఖర్చులను మంత్రి వెల్లడించలేదు.