న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం గురించి తలెత్తిన వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీని విచారించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం ఉదయం మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. రాఫెల్ ఒప్పందంలో అక్రమాల గురించి విచారణకు మోదీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ‘రాఫెల్ ఒప్పందానికి మోదీ బైపాస్ సర్జరీ చేశారు. అనిల్ అంబానీకి ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందంలో జాప్యం చేశారని’ ఆరోపించారు. ‘ఈ రోజుల్లో అన్నీ అదృశ్యమవుతున్నాయి. 2016లో నోట్ల రద్దు తర్వాత రెండు కోట్ల మంది ఉద్యోగాలు కనుమరుగయ్యాయి.ప్రజలందరి ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తానన్న హామీ మాయమైంది.వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కనుమరుగైంది.ఇప్పుడు రాఫెల్ ఫైళ్లు మాయమయ్యా’యని ఎగతాళి చేసారు. ‘రాఫెల్ ఒప్పందానికి సంబంధించి విలువైన పత్రాలు కనపడటం లేదంటేనే అవి ఎంత విలువైనవో తెలుస్తుంది. న్యాయం చేయాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వానికి, అటు కోర్టులు రెండింటికీ ఉంది. ఒప్పంద పత్రాలను దొంగిలించారని ప్రభుత్వమే ఒప్పు కున్నందున. వాటిపై సందేహాలు అనవసరం లేదు. దస్త్రాల చోరీ వెనుక ఎవరున్నారో తేల్చాలని. ప్రధాని కార్యాలయం చేస్తున్న ప్రకటనలపైనా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు