గో బ్యాక్‌ మోడీ

గో బ్యాక్‌ మోడీ

ఇంఫాల్‌ : మణిపూర్‌లో నరమేధం, మహిళలపై తీవ్ర హింసను అడ్డుకోవడానికి ప్రయత్నించకపోగా, రెండేళ్ల నాలుగు నెలలపాటు మొఖం చాటేసి ఇప్పుడు పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి నిరసన తెలపనున్నట్లు రాష్ట్రంలోని ప్రముఖ మహిళా సంఘాలు ప్రకటించాయి. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ‘గో బ్యాక్‌ మోడీ’ పేరిట శనివారం నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ట్లు తెలిపాయి. మోడీని కసాయిగా వర్ణించాయి. ‘వర్కింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ మీరా ఫైబి’ బ్యానర్‌ కింద వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపాయి. వర్కింగ్‌ గ్రూప్‌ ప్రధాన కార్యదర్శి అపాబీ లీమా ఇంఫాల్‌లో మాట్లాడుతూ 2023 మే 3 నుంచి రాష్ట్రంలో చెలరేగుతున్న హింసను పరిష్కరించడంలో ప్రధానమంత్రి విఫలమె ౖనందున నిరసన తెలియజేయాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హింసా కాండలో వందలాదిమంది మరణించారని, వేలాది మంది గాయాలు, లైంగిక హింసకు గురయ్యారని చెప్పారు. అనేకవేల మంది నిరాశ్రయులుగా మారి ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారని గుర్తుచేశారు. ‘హింసను అంతం చేయడానికి ఏమీ చేయకుండా.. రాష్ట్రంలో ఎందుకు పర్యటిస్తున్నారు? మణిపూర్‌ ను పూర్తిగా నాశనం చేయడానికి మరొక వ్యూహాంతో వస్తున్నారా.?’ అని ఆమె ప్రశ్నించారు. ఈ నిరసనల్లో ‘మోడీ గో బ్యాక్‌’, ‘స్వీయ నిర్ణయాధికారం మా హక్కు’, ‘ఎఎఫ్‌ఎస్‌పిఎ ఒక వలస చట్టం’, ‘విభజించి పాలించే విధానాన్ని ఆపండి’, ‘మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నాం’ వంటి నినాదాలు చేయనున్నట్లు చెప్పారు. పీపుల్స్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ మణిపూర్‌ (పిపిఎఎం) నాయకులు కూడా మోడీ పర్యటనను వ్యతిరేకించారు. ఈ పర్యటనలో మోడీతో మహిళా సంఘాలు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు మాట్లాడానికి అవకాశం ఇవ్వకపోవడాన్ని ఖండించారు.

ప్రచారం కోసమే మోడీ పర్యటన

మోడీ పర్యటన కేవలం ప్రచారం కోసమేనని కాంగ్రెస్‌ విమర్శించింది. మణిపూర్‌ పిసిసి అధ్యక్షులు కిషమ్‌ మేఘచంద్ర ఒక వీడియో సందేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్ర ప్రజలు శాంతి, పునరావాసం, న్యాయం కోసం ఒక నిర్దిష్ట రోడ్‌మ్యాప్‌ను ఆశిస్తున్నారు. ఈ పర్యటనలో భాగస్వామ పక్షాలతో చర్చలు లేకపోవడం బాధాకరం’ అని అన్నారు. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ, కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జ్‌ జైరామ్‌రమేష్‌ ఈ పర్యటన గురించి స్పందిస్తూ ‘మణిపూర్‌లో మోడీ మూడు గంటల కన్నా తక్కువ సమయమే గడుపుతారు. శాంతి,సామరస్యం నెలకొల్పడానికి ప్రోత్సాహానికి బదులుగా, ఈ పర్యటన ఒక ప్రహసనంగా మారనుంది’ అని పేర్కొన్నారు.

బిజెపి నేతల మూకుమ్మడి రాజీనామా

మణిపూర్‌ పర్యటన ముందు ప్రధాని నరేంద్ర మోడీకి సొంత పార్టీ నేతలు షాక్‌ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను నాయకత్వం పట్టించుకోవడం లేదని, పార్టీ రాష్ట్ర కమిటీలో ఐకమత్యం కొరవడిందని విమర్శిస్తూ ఫుంగ్యార్‌ మండలానికి చెందిన 43 మంది బిజెపి సభ్యులు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాష్ట్ర బిజెపికి ప్రత్యేక ఆహ్వాని తుడిగా ఉన్న నగచోమ్నీ రాంషాంగ్‌ నేతృత్వంలో వీరందరూ రాజీనామాలు సమర్పించారు. వీరిలో ఫుంగ్యార్‌ మండల పార్టీ అధ్యక్షుడు, మహిళా మోర్చా అధ్యక్షురాలు, యువ మోర్చా అధ్యక్షుడు, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు, ఎస్టీ మోర్చా కార్యవర్గ సభ్యుడితో పాటు బూత్‌ స్థాయి అధ్యక్షులు కూడా ఉన్నారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos