మోడీ రాజ్యాంగం పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం ఒక నాటకం

మోడీ రాజ్యాంగం పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం ఒక నాటకం

న్యూఢిల్లీ : 2024 ఎన్నికలలో ఎన్డిఎ కూటమి నేతగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోడీ భారత రాజ్యాంగం పట్ల కొత్తగా కనపరుస్తున్న భక్తి ఒక భ్రాంతి మాత్రమేనని దుష్యంత్ దవే విమర్శించారు. ఆంగ్ల దినపత్రిక- ది హిందూ లో దవే తన అభిప్రాయాలను ఒక వ్యాసం రూపంలో వెల్లడించారు. జూన్ 7న కొత్తగా ఎన్నికైన ఎన్డిఎ కూటమి తొలి సమావేశం నూతన పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ ( రాజ్యాంగ వేదిక) లో జరగడం, వేదికపైకి రాగానే భారత రాజ్యాంగ ప్రతిని కళ్ళకు అద్దుకుని, నుదుటికి తాకించి భక్తిని ప్రదర్శించడం అంతా ఒక నాటకమేనని దుష్యంత్ దవే అన్నారు. నిజానికి 2014 నుండీ ప్రధానిగా వ్యవహరించిన కాలంలో గాని, అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గాని నరేంద్ర మోడీ ఏనాడూ రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించడం గాని, దానికి కట్టుబడి పని చేయడం గాని జరగలేదన్నారు.
జూన్ 9వ తేదీనే మోడీ ప్రధాన్మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రు.20,000 కోట్లు విడుదల చేస్తూ తొలి సంతకం చేశారని, వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధి కింద వచ్చే ఆ స్కీముకు ఆర్థిక శాఖ లో వివిధ వ్యయాలను నియంత్రించే శాఖ కూడా ఆమోదం తెలిపినప్పుడే నిధులను విడుదల చేయాల్సివుందని దవే అన్నారు. ఆ రెండు శాఖలకు మంత్రులు ఎవరో ప్రకటించకుండానే అన్నీ తానే అయినట్టు మోడీ ఫైలుపై సంతకం చేయడం ప్రభుత్వ బిజినెస్ రూల్స్ను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇదంతా చేస్తూనే తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు చిత్రించుకునే నాటకం మోడీ నడుపుతున్నారని అన్నారు. ఆ యా మంత్రుల శాఖలను నిర్ణయించకుండానే తొలి కాబినెట్ సమావేశం జరిగింది. అందులో అదనంగా 3 కోట్ల గృహాలను ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను చేయవలసినది సంబంధిత మంత్రి. ఆ శాఖకు ఎవరు మంత్రో నిర్ణయం కాకుండానే కాబినెట్ లో నిర్ణయం ఎలా తీసుకుంటారు ? ఆ యా మంత్రివర్గ ఉపసంఘాలను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలా చేయకమునుపే ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పదవీకాలాన్ని పొడిగించేశారు. అలాగే తన ప్రధానకార్యదర్శి పదవీకాలాన్ని కూడా. క్యాబినెట్ నియామకాల పసంఘం పేరుతో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాని అటువంటి ఉపసంఘాన్ని ఇంకా ఏర్పాటు చేయ లేదు.గడిచిన నాలుగైదు రోజుల్లోనే రాజ్యాంగం నిర్దేశించిన విధి విధానాలను తోసిరాజంటూ మోడీ ఈ విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూంటే ఒక్క మంత్రి గాని, ఒక్క సీనియర్ బ్యూరోక్రాట్ గాని అభ్యంతరం చెప్పలేదు. ”ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించేందుకు అవసరమైన నిబంధనలను, ఆ బాధ్యతలలో వేటిని ఏ యే మంత్రులు నిర్వర్తిస్తారో ఆ నిర్ణయాన్ని దేశాధ్యక్షుడు తీసుకుంటార”ని రాజ్యాంగంలోని 77వ అధికరణం చెప్తోంది. అంతేగాక మంత్రివర్గానికి సమిష్టి బాధ్యత ఉంటుందని రాజ్యాంగం తెలియజేస్తోంది. కాని దానికి విరుద్ధంగా ప్రధానమంత్రి కార్యాలయం వద్ద అన్ని అధికారాలూ కేంద్రీకృతం అయిపోతున్నాయని దుష్యంత్ దవే విమర్శించారు. నిజానికి పిఎంవో కార్యాలయానికి ఉన్న బాధ్యత అంతా ప్రధానికి సహాయపడడం మాత్రమేనని, ప్రభుత్వ వ్యవహారాలను ఆ యా మంత్రిత్వ శాఖలు నిర్వర్తిస్తాయని బిజినెస్ రూల్స్ చెప్తున్నాయి. పదేళ్ళ తర్వాత మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. తమ మద్దతు మీదనే ఈ ప్రభుత్వం ఆధారపడివుందని మిత్రపక్షాలు చెప్పుకుంటున్నాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ మిత్ర పక్షాలను సంప్రదించడం, ఉమ్మడి ఆమోదంతో నిర్ణయాలు జరగడం అనే సంకీర్ణధర్మం ఎక్కడా కనిపించడం లేదు. సర్వమూ ప్రధాని కార్యాలయమే అయిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos