
న్యూ ఢిల్లీ: భాజపా పెద్ద నోట్లను రద్దు చేయటం భారీ కుంభకోణమని విపక్షాలు మంగళవారం ఇక్కడ ఆరోపించారు. ఇక్కడి కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన మాధ్యమ ప్రతినిధుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, కపిల్ సిబల్, తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు మాట్లాడారు. టీఎన్ఎన్ వరల్డ్ వెబ్ సైట్ శూల శోధన (స్టింగ్ ఆపరేషన్) వీడియోలో ఈ విషయం తేట తెల్లమైందని వివరించారు. ‘స్టింగ్ ఆపరేషన్ వీడియోలో భారీగా రూ.2 వేలు, రూ.500 నోట్లు ఉన్న దృశ్యాలు ఉన్నాయి. నోట్ల మార్పిడీ పై భాజపా కార్యకర్త ఒకరు 40 శాతం కమీషన్కు పాత నోట్లు తీసుకొని కొత్త నోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నార’ని పేర్కొన్నారు. గడువు తీరినా పాతనోట్లు ఎలా మారుస్తున్నారో భాజపా నేతలే చెప్పాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేసారు.