కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వినూత్న నీటిపారుదల ప్రాజెక్టుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ శ్రీకారం చుట్టింది. ఆసియాలోనే తొలిసారిగా అవుట్లెట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఓఎమ్ ఎస్) అనే ఇజ్రాయేల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ పైపుల ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ ప్రాజెక్టును చేపట్టింది. కాళేశ్వరం ప్యాకేజీ-21గా పిలిచే ఈ కొండం చెరువు ప్రాజెక్టు పూర్తయితే నీరు ఆవిరి నష్టంగాని – ఇంకుడు నష్టం గాని ఉండదని మేఘా ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ బొంతు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ”ఇప్పటికే పలు దేశాల్లో ఇలాంటి పైప్ లైన్ ఇరిగేషన్ వ్యవస్థకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ పైపులు ఏర్పాటు చేసేప్పుడు కొంత ఆటంకం కలిగినా ఆ తర్వాత ఆ పైపులపైన రైతు యధావిధిగా సాగుచేసుకోవచ్చు.” అని ఆయన వెల్లడించారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా మేఘా ఇంజనీరింగ్ ఒకవైపు కాలువలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించడానికి కృషి చేస్తూనే మరోవైపు పైప్ లైన్ ఇరిగేషన్ అనే నూతన పధ్ధతిని కూడా అమలు చేయాలని సంకల్పించింది. కాలువ ద్వారా వెళ్లే నీరు ఆవిరి కాకుండా పైప్ లైన్ ఇరిగేషన్ ద్వారా నేరుగా రైతుల పొలాలకే పైపులతో నీటిని సరఫరా చేసేలా పనులను ప్రయోగాత్మకంగా చేపడుతుంది. ఇలా పైపుల ద్వారా నీటిని పంపించే ఏర్పాటు చేయడం వల్ల భూసేకరణ అవసరం కూడా ఉండదు. ఇప్పటికే పైపుల ద్వారా సాగునీటి సరఫరా విధానం మధ్యప్రదేశ్ – రాజస్థాన్ – గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలులో ఉన్నా.. భారీ స్థాయిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం మాత్రం ఇదే తొలిసారి.
