ఢిల్లీ : రష్యాలో జరిగిన నైపుణ్యాల పోటీ – 2019లో భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. నీటి సాంకేతికతలో ఒడిశాకు చెందిన అశ్వత్ నారాయణ (25) స్వర్ణం సాధించాడు. వెబ్ సాంకేతికతలో పదిహేడేళ్ల తెలుగు అబ్బాయి ప్రణవ్ రజతం చేజిక్కించుకున్నాడు. ఆభరణాల సాంకేతికతలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంజయ్ ప్రామాణిక్ (21), గ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీలో మహారాష్ట్రకు చెందిన శ్వేతా రత్నపుర కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో 68 దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు. భారత్ తరఫున 48 మంది మొబైల్ రోబోటిక్స్, ప్రోటోటైప్ మోడలింగ్, హెయిర్ డ్రెస్సింగ్, బేకింగ్, వెల్డింగ్, బ్రిక్ లేయింగ్, కార్ పెయింటింగ్, ఫ్లోరిస్ట్రీ విభాగంలో తమ ప్రతిభను ప్రదర్శించారు.