తెలుగు రాష్ట్రాల్లో గొర్రె, మేక మాంసానికి డిమాండ్ ఏర్పడింది. కిలో ధర గత నాలుగు నెలల్లోనే ప్రాంతాల వారీగా రూ.40 నుంచి రూ.60 దాకా పెరిగింది. కొన్ని నగరాల్లో కిలో ధర రూ.500 నుంచి రూ.620 దాకా ఉంది. దేశవ్యాప్తంగా గొర్రెలు, మేకల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు సైతం హైదరాబాద్‌కు వచ్చి కొని తీసుకెళుతున్నారు.
గతంలో మహారాష్ట్ర నుంచి గొర్రెలు, మేకలు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు తెచ్చి అమ్మేవారు. ఇప్పుడు అక్కడి నుంచి రావడం తగ్గిందని మాంసం వ్యాపారులు తెలిపారు. జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు ప్రకారం ప్రతి వ్యక్తి ఏటా 11 కిలోల దాకా మాంసం తినాలి. తెలుగు రాష్ట్రాల్లో తలసరి వినియోగం 7.5 కిలోలే ఉన్నా మాంసం ధరలు ఏటా కనీసం 10 శాతం పెరుగుతుండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో మాంసం వినియోగం పెరుగుతుండడమే ఇందుకు కారణం.
దేశవ్యాప్తంగా ఏటా గొర్రెలు, మేకల మాంసం డిమాండ్ 20 శాతం వరకూ పెరుగుతోందని కేంద్ర పశుసంవర్థక శాఖ అంచనా. కానీ ఈ స్థాయిలో ఈ జీవాల పెంపకంపై దృష్టి పెట్టడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తప్ప ఇతర రాష్ట్రాల్లో ఈ జీవాల పెంపకానికి సరైన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. మహారాష్ట్రలో ఒకప్పుడు గొర్రెల సంఖ్య అధికంగా ఉండేది. కొల్హాపూర్, షోలాపూర్, విదర్భ, ముంబయి, పుణె, నాగ్‌పుర్‌ల నుంచి తెలంగాణకు పెద్దయెత్తున నిత్యం లారీల్లో అమ్మకానికి వచ్చేవి. ఆయా నగరాల్లో గొర్రెల సంఖ్య తగ్గుతుండడంతో పొరుగునున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు పంపడం బాగా తగ్గిందని మహారాష్ట్ర అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల సమయంలో సభలు, సమావేశాల సందర్భంగా మాంసాన్ని భారీగా వినియోగించారు. కొన్నిచోట్ల అభ్యర్థులు ఊరికి ఇన్నని జీవాలను ఇచ్చి విందులు ఏర్పాటు చేయించారు. దీంతో జీవాల సంఖ్య తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధర చుక్కలనంటుతోంది.