పదేళ్ల క్రితం
రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమా గుర్తుందా..అందులో రవితేజ ఉదయం పది నుంచి సాయంత్రం
ఐదు గంటల వరకు పని చేసే ఉద్యోగాలు నచ్చక చోరీల బాట పడతాడు.ఈ సినిమాను స్పూర్తిగా తీసుకన్నాడో
ఏమో కానీ ఎంబీఏలో బంగారు పతకం సాధించిన యువకుడు ఒకడు ఉద్యోగం చేయడం ఇష్టం లేక చోరీల
బాట పట్టాడు.కిక్ సినిమాలో రవితేజ ఒక మంచి ఉద్దేశంతో చోరీలు చేస్తే ఇక్కడ యువకుడు
మాత్రం జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పట్టాడు.ప్రకాశం జిల్లా వేటపాలెం ప్రాంతానికి
చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ లోకేశ్ అలిచాస్ రిచర్డ్ చెన్నై తంగవేలు యూనివర్శిటీలో
ఎంబీఏలో బంగారు పతకం సాధించాడు.ఉన్నత కుటుంబానికి చెందిన వంశీ కుటుంబానికి దూరంగా బతుకుతూ
విలాసవంత జీవితానికి అలవాటు పడ్డాడు.అయితే ఉద్యోగాలు చేస్తే వచ్చే వేతనంతో తాను కోరుకున్న
లగ్జరీ లైఫ్ కుదరదని భావించి చోరీల బాట పట్టాడు.అందుకు హైదరాబాద్ జంటనగరాలను లక్ష్యంగా
ఎంచుకున్నాడు.సంపన్నులు నివసించే ప్రాంతాల్లో కార్లలో తిరుగుతూ మొదట రెక్కీ చేస్తాడు.ఏదైనా
ఇంటికి తాళం వేసి ఉన్నట్లు కనిపిస్తే అంతే క్షణాల్లో తాళం విరగ్గొట్టి నగలు,నగదు దోచుకెళతాడు.చోరీ
చేసిన నగలను ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో కుదువపెట్టి నగదు తీసుకునేవాడు.వచ్చిన డబ్బులతో
విహారయాత్రలకు వెళ్లడం,స్టార్ హోటళ్లలో బస చేయడం,జల్సాలు చేసేవాడు.చోరీల కేసుల్లో
వివిధ సందర్భాల్లో సుమారు ఐదేళ్ల పాటు జైలు జీవితం గడిపాడు.పీడీ యాక్ట్ కూడా నమోదు
చేశారు.గత ఏడాది ఆగస్ట్‌లో జైలు నుంచి విడుదలైన నిందితుడు మళ్లీ చోరీల బాట పట్టాడు.ఈ
ఆరు నెలల్లో పదికి పైగా చోరీలు చేశాడు.పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బెంగళూరు నగరంలో
ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఉంటూ హైదరాబాద్ నగరంలో చోరీలకు స్కెచ్ గీసేవాడు.దీంతో
మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో వంశీని చేర్చిన బాలానగర్ పోలీసులు బుధవారం నిందితుడిని
అరెస్ట్ చేశారు..