లక్నో: ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ కూటమి కట్టే ప్రసక్తే లేదని బీఎస్పీ అధినేత మాయావతి స్పష్టం చేశారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు రాజ్యసభ ఎన్నికల్లో, మండలి ఎన్నికల్లో బీజేపీ లేదా ఇతర అభ్యర్థులకు తాము ఓట్లు వేస్తామంటూ ఆమె గత వారంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ, బీఎస్పీ మధ్య పొత్తుపొడిచే అవకాశాలున్నాయంటూ ప్రచారం జోరందుకుంది. దీనిపై మాయావతి సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ బీజేపీతో జట్టుకట్టడం సాధ్యం కాదు. మతతత్వ పార్టీలతో బీఎస్పీ స్నేహం చేయదు. సర్వజన సర్వధర్మ హితమే మా పార్టీ సిద్ధాంతం. ఇది బీజేపీ సిద్ధాంతానికి పూర్తి విరుద్ధం. కాబట్టి కుల, మత, పెట్టుబడిదారీ సిద్ధాంతాలున్న వారితో బీఎస్పీ కూటమి కట్టడం జరగదు. అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. అలాంటి పార్టీల కూటమిలో మాత్రం చేరబోను. కులతత్వ, మతతత్వ, పెట్టుబడిదారీ విధానాలతో కూడిన పార్టీలపై నా పోరాటం కొనసాగుతుంది. ఎప్పటికీ ఎవరి ముందు నేను మోకరిల్లేది లేదు. వచ్చే మండలి ఎన్నికల్లో ఎస్పీ నిలబెట్టే రెండో అభ్యర్థిని ఓడించి తీరుతామ’ని స్పష్టం చేశారు.