
ఇస్లామాబాద్ : ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్
అధినేత మసూద్ అజర్, తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపాడు. తన మూత్ర పిండాలు, కాలేయం
బాగానే పని చేస్తున్నాయని చెబుతూ, ఇండియా నిర్వహించిన మెరుపు దాడుల్లో జైష్ శిబిరాలకు
ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని నిరూపించడానికి
విలువిద్య, తుపాకీ కాల్పుల పోటీలకు కూడా సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీనుద్దేశించి
వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. తాను అనారోగ్యంతో ఉన్నట్లు పాక్ విదేశాంగ మంత్రి చేసిన
ప్రకటనను ఖండిస్తూ, ఇటీవలి కాలంలో తాను డయాలసిస్ కూడా చేయించుకోలేదని తెలిపాడు. ఇదే
సందర్భంలో ఫిబ్రవరి 14న పుల్వమాలో నరమేధానికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దార్‌ను ప్రశంసించాడు.
ఉగ్రవాదుల పత్రిక ఆల్-కలంలో మసూద్ క్రమం తప్పకుండా వ్యాసాలు రాస్తుంటాడు. ఇటీవలి
తాజా వార పత్రికలో…తాను క్షేమంగానే ఉన్నానని, తన మద్దతుదారులందరు కూడా బాగానే ఉన్నారని,
ఇండియా చెబుతున్నట్లుగా తమ ఉగ్ర సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపాడు. అదిల్
దార్ లాంటి కాశ్మీరీలు లోయలో చక్కగా పని చేస్తున్నారని ప్రశంసిస్తూ, దార్ అంటించిన
నిప్పు ఇప్పట్లో ఆరిపోదని హెచ్చరించాడు.