న్యూఢిల్లీ: తాను సజీవంగానే ఉన్నాననీ తన ఆరోగ్యం గురించి సాగుతున్న ప్రచారమంతా వదంతేనని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పేర్కొన్నాడు. బుధవారం రాత్రి జైషే మహ్మద్ వెబ్‌సైట్‌లో ఈ మేరకు ఒక ఆడియో క్లిప్ పోస్టు చేసినట్లు దేశీయ మాధ్యమ సంస్థ ఒకటి తెలిపింది. మసీదులు, ముస్లింలపై పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న విచారణను వెంటనే నిలిపివేయాలంటూ డిమాండు చేసారు. దాదాపు పదకొండు నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో భారత్, పుల్వామా దాడి, పాకిస్తాన్ ఉదారవాదుల గురించి ప్రస్తావించాడు. కశ్మీర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా జీహాద్ మొదలుపెట్టాలని అనుచరులకు పిలుపు నిచ్చాడు. ‘‘నా మరణం గురించి వార్తలు వస్తున్నాయి. ఎంత కాలం బతకాలో, ఎప్పుడు చనిపోవాలో దేవుడే నిర్ణయిస్తాడు’ అని పేర్కొన్నాడు. భారత జైల్‌లో ఉన్నప్పుడు తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపించాడు. పాకిస్తాన్ ఒత్తిడి కింద పని చేస్తోందనీ దేవుడికే భయపడాలని పేర్కొన్నాడు. మలాలా వంటి ఉదారవాదుల చేతుల్లోకి దేశాన్ని పోనివ్వరాదని కోరారు. ఒత్తిళ్లకు లొంగి తమతో సంప్రదింపులు జరిపినట్లు పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ పేర్కొరన్నారు. తమకు అవేమీ కొరగానివని తేల్చి చెప్పారు.