ఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 33కి చేరడంతో ప్రజల్లో అంతకంతకూ పెరుగుతున్న భయాలతో పాటు ఎన్ 95 మాస్క్‌ల కొరత కూడా తలెత్తింది. మాస్క్‌లకు గిరాకీ పెరగడంతో ఆన్‌లైన్ సోర్ట్స్, మెడికల్ స్టోర్స్‌లో ఒక్కసారిగా ధరలు చుక్కలను అంటుతున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పందించింది. మాస్క్‌లు కొనలేకపోయామనే భయం అవసరం లేదంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక అడ్వైజయిరీ విడుదల చేసింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘అనారోగ్యంతో ఉన్నట్టు అనిపించినా, దగ్గు, జ్వరం, శ్వాస పీల్చడం కష్టంగా అనిపించినా మీరు మాస్క్ ధరించండి’ అంటూ తాజా సూచనలు చేసింది. ఫేస్ మాస్క్‌ల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ హెచ్చరించారు. మార్కెట్లో మాస్క్‌లు, శానిటైజర్ల కొరత ఏర్పడటం, సాధారణ ధరల కంటే హెచ్చు ధరలను కెమిస్టులు వసూలు చేస్తుండటం వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీనిపై మంత్రి ఘాటు హెచ్చరికలే చేశారు. మాస్క్‌ల బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.