ముంబై: గడ్చిరోలి జిల్లా కొర్చి పరిసరాల్లో గురవారం సాయంత్రం పొదుద పోయాక పోలీసులు, మావోయిస్టుల మధ్య హోరాహోరీ కాల్పులు సంభవించాయి. అక్కడ గస్తీ కాస్తున్న పోలీసులపై ముందుగా మావోయిస్టులు కాల్పులు జరిపారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొంతసేపు కాల్పులు జరిగిన తర్వాత మావోయిస్టులు దట్టమైన అడవుల్లోకి పరారైనట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. నక్సలైట్ ఉద్యమ రూపకర్త చారుమజుందార్ జ్ఞాపకార్థం ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ‘‘అమరవీరుల వారం’’గా పాటించాలంటూ నక్సలైట్లు కొన్ని పోస్టర్లు అతికించినట్టు సమాచారం. మసేలీ- నవార్గాన్ రోడ్డులో ఇవి దర్శనమిచ్చాయని అధికారులు వెల్లడించారు.