మూడో టెస్టుకు మార్క్‌ వుడ్‌ దూరం

  • In Sports
  • August 23, 2021
  • 151 Views
మూడో టెస్టుకు మార్క్‌ వుడ్‌ దూరం

లండన్: టీమిండియాతో బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ టెస్టుకు దూరమయ్యాడు. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఈ ఇంగ్లీష్ పేసర్ గాయపడ్డాడు. మూడో టెస్ట్ సమయానికి అతడు కోలుకుంటాడని ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం భావించింది. అయితే వుడ్ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో అతను మూడో టెస్టుకు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది.
అయితే మార్క్ వుడ్ జట్టుతోనే ఉంటాడని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంపై దృష్టిసారిస్తాడని ఈసీబీ వెల్లడించింది. మూడో టెస్ట్ అనంతరం అతనికి మరోసారి ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తామని, అప్పటికీ కోలుకోలేకపోతే సిరీస్ నుంచి తప్పిస్తామని పేర్కొంది. కాగా, గాయాల కారణంగా ఇప్పటికే స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ లాంటి స్టార్ పేసర్ల సేవలను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును తాజాగా వుడ్‌కు తగిలిన గాయం మరింత కలవరపెడుతోంది. భారత్‌తో ఐదు టెస్టు సిరీస్‌లో రెండు టెస్టుల అనంతరం 0-1తో వెనుకబడిన రూట్ సేనకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos