న్యూఢిల్లీ : భారత్‌తో సంబంధాలు, వాణిజ్యం విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలను కలిగిస్తున్నది. ప్రధాని మోడీ స్నేహితుడైన ఆయన.. అమెరికాకు రెండో సారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి పలు షాక్‌లు ఇస్తున్నారు. ట్రేడ్ టారిఫ్‌లు, ఇటీవల భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులలో ఆయన వ్యవహరించిన తీరు, కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వంపై ప్రతిపాదన తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అరబ్ దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్.. విదేశీ గడ్డపై మాట్లాడుతూ భారత్‌లో యాపిల్ కంపెనీ కార్యకలాపాలపై అసంతృప్తి వెళ్లగక్కిన తీరు కూడా ఆందోళనను, అనుమానాలను రేకెత్తించింది. తాజాగా, అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటాతో సహా వివిధ విమానాశ్రయాలకు భారత్ నుంచి 15 కంటైనర్లలో మామిడి షిప్‌మెంట్లు వెళ్లాయి. డాక్యుమెంటేషన్ లోపాల పేరుతో అమెరికా అధికారులు ఎగుమతైన ఆ మామిడిపండ్లను తిరస్కరించారు. అమెరికా నిర్ణయం మామిడిపండ్ల ఎగుమతిదారులను తీవ్ర షాక్‌కు గురి చేసింది. ఆ మామిడిపండ్లను తిరిగి భారత్‌కు తీసుకొచ్చినా అది తీవ్ర ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పాడైపోయే అవకాశం ఎక్కువే. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్న చాలా మంది ఎగుమతిదారులు మామిడి సరకును అమెరికాలోనే పడేయ్యాలని నిర్ణయించుకున్నారు. అమెరికా చర్యతో ఐదు లక్షల డాలర్ల (రూ.4.27 కోట్లు) నష్టాన్ని ఎగుమతి దారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 8, 9 తేదీలలో.. అమెరికాకు ఎగుమతి అయ్యే ఈ మామిడి పండ్లు ముంబయిలో ఇర్రేడియేషన్ ప్రక్రియకు వెళ్లాయి. అమెరికాకు ఎగుమతి కావాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి. మామిడిలో తెగుళ్లు తొలగించటానికి, అవి ఎక్కువ కాలం ఉండటానికి పండ్లను నియంత్రిత ఇర్రేడియేషన్‌కు పంపుతారు. ఈ ప్రక్రియ జరిగినప్పటికీ.. అక్కడి అమెరికా అధికారులు మాత్రం డాక్యుమెంటేషన్‌లో పొరపాట్లను కారణంగా చూపెడుతూ ఎగుమతిని తిరస్కరించారు. ముఖ్యంగా, పీపీక్యూ 203 ఫారంలో తప్పులు దొర్లాయని చెప్పారు. ”పీపీక్యూ 203 ఫారం సరిగ్గా జారీ చేయని కారణంగా సరకును తిరస్కరించినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తెలిపింది. సరకును వెనక్కి పంపటమో, ధ్వంసం చేయటమో చేయాలని చెప్పింది. వెనక్కి పంపేందుకు అయ్యే ఖర్చును అమెరికా ప్రభుత్వం భరించదు” అని అమెరికా వ్యవసాయ విభాగం (యుఎస్‌డిఎ) స్పష్టం చేసినట్టు వ్యాపారులు తెలిపారు.ముంబయిలోని ఇర్రేడియేషన్ కేంద్రంలో యుఎస్‌డిఎ ప్రతినిధి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుందని వారు అన్నారు. ”అమెరికాకు మామిడి పండ్ల ఎగుమతికి అవసరమైన పిపిక్యూ203 ఫారమ్‌ను ఆ ప్రతినిధే ధ్రువీకరించాలి. ఇర్రేడియేషన్ కేంద్రంలో జరిగిన పొరపాట్లకు మేము నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది” అని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇర్రేడియేషన్‌కు సంబంధించిన నిబంధనలు పాటించలేదని అమెరికా అధికారులు చెప్తున్నదానిలో వాస్తవం లేదని ఒక వ్యాపారి తెలిపాడు. ప్రక్రియ పూర్తయ్యాకే పిపిక్యూ203 ఫారమ్ ఇచ్చారనీ, యూఎస్‌డీఏ అధికారి జారీ చేసిన ఆ ఫారమ్ లేకుండా ముంబయి ఎయిర్‌పోర్టులో మామిడి పండ్లను విమానంలోకి ఎక్కించటానికి కూడా అనుమతించరని వివరించాడు.ప్రపంచంలోనే మామిడి ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉన్నది. అమెరికా.. భారత్‌కు ప్రధాన దిగుమతిదారుగా ఉన్నది. ఇంత పెద్ద మొత్తంలో భారత్ నుంచి ఎగుమతి అయిన మామిడిపండ్లను సరైన డాక్యుమెంటేషన్ లేదనే కారణంతో అమెరికా తిరస్కరించటం చర్చనీయాంశంగా మారింది.