కోల్కతా : ‘దేశ ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి చేస్తోంది. ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమవ్వాల’ని ఎన్డీయే ఇతర విపక్షాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ‘బీజేపీపై పోరాడడానికి వ్యూహాలపై చర్చించడానికి సమావేశం అవుదాం. . బీజేపీ ఇతర పార్టీలన్నీ ఐక్యత సాధించాలి. దేశ ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఏర్పడే దిశగా అడుగులు వేయాలి. కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణితో పాలన కొనసాగిస్తోంది. దానిపై పోరాడేందుకు ప్రగతిశీల శక్తులన్నీ చేతులు కలపాలి. సంస్థాగత ప్రజాస్వామ్య విలువలపై బీజేపీ దాడులు చేస్తోంది. భాజపా తీరుపై ఆందోళన వ్యక్తం చేసేందుకే నేను విపక్షాలకు ఈ లేఖ రాసాను. విపక్షాలపై ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, సీవీసీ, ఆదాయ పన్ను శాఖ వంటి సంస్థలను వాడుకుంటోంద’ని విమర్శించారు.