పొద్దస్తమానం పాక్‌తో పోలికా…ప్రధానిపై మమత విసుర్లు

సిలిగురి: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ పాకిస్థాన్‌తో మన దేశాన్ని పోల్చడమేమిటని ప్రశ్నించారు. మీరు ప్రధానా? ఆ దేశానికి రాయబారా? అంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సిలిగురిలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు.  స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా, ఇంకా దేశ ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి రావడం నిజంగా సిగ్గు చేటని దుయ్యబట్టారు. గొప్ప సంస్కృతి, వారసత్వ సంపదకు నెలవైన భారత్‌ను ప్రధాని ఎప్పుడూ పాకిస్థాన్‌తో పోల్చడమేమిటని నిలదీశారు. మీరు దేశానికి ప్రధాన మంత్రా లేక భారత్‌లో పాకిస్థాన్‌ రాయబారా అంటూ చురకలంటించారు. అన్ని సమస్యల్లోకి పాకిస్థాన్‌ను లాగడమేమిటని ప్రశ్నించారు. జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) అమలు విషయంలో భాజపా గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని దేశంలో ఎన్‌ఆర్‌సీ ఉండబోదంటారు,  కేంద్ర హోం మంత్రి, ఇతర మంత్రులేమో దేశ వ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపడతామని ప్రకటనలు గుప్పిస్తారు అంటూ మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos