ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరో మూడు రోజుల్లో ఏడాది పూర్తి కానుంది.ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ అధికారంలోకి రాకముందు జరిగిన పలు ఘటనలను నెమరు వేసుకుంటున్నారు.ఈ క్రమంలో నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఏపీలో చంద్రబాబును ఓడించి జగన్ గెలుస్తాడని సినీ ఇండస్ట్రీలో ఎవరూ నమ్మలేదని.. బెట్లు కూడా కాశారని చెప్పుకొచ్చాడు. ఫలితాలకు ముందు తనకు మహేష్ బాబుకు మధ్య జరిగిన సంభాషణను కూడా పోసాని పంచుకున్నాడు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ గురించి.. ఆయన గెలుపు అవకాశాల గురించి మహేష్ బాబు స్వయంగా పోసానిని అడిగారట.. ఎటువంటి సంకోచం లేకుండా జగన్ గెలుస్తాడని తాను మహేష్ కు చెప్పినట్టు పోసాని వివరించాడు. అయితే చంద్రబాబు పసుపు కుంకుమ సహా వివిధ పథకాల ద్వారా చంద్రబాబు రూ.10వేలు 12వేలు అంటూ డబ్బులు పంచుతున్నాడు కదా జగన్ గెలుస్తాడా అని మహేష్ అడిగాడని పోసాని తెలిపారు. ‘బాబు.. ప్రజలు తెలివైన వారని.. జగన్ నే గెలిపిస్తారని’ తాను మహేష్ కు చెప్పినట్టు పోసాని వివరించాడు. రాజకీయాలపై తనకు అస్సలు అవగాహన లేదని.. తన కొడుకు గౌతమ్ కు తెలిసినంత కూడా రాజకీయాల గురించి తనకు తెలియదని ఆ మధ్య మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. అలాంటి మహేష్ ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఆరా తీశాడని పోసాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి..